వివరణ

ప్రపంచ సంగీత పరిశోధనకై సంగణక నమూనాలు సృష్టించేందుకు, కాంప్ మ్యూజిక్ అనబడే ఈ ప్రాజెక్టు, యూరోపియన్ రీసెర్చ్ కౌన్సిల్ వారి నిధులతో ప్రారంభించబడింది. స్పెయిన్ దేశంలో బార్సిలోనాలో ఉన్న పాంపేవ్ ఫాబ్రా విశ్వవిద్యాలయంలో, మ్యూజిక్ టెక్నాలజీ గ్రూప్ లో ఉన్న చవియర్ సెర్రా ఆద్వర్యంలో ఇది 2011 నుంచి 2016 దాకా కొనసాగుతుంది.

ప్రపంచ సంగీత సంగణనలో సమకాలీన పరిశోధక అంశాల్ని, ఆయా సంస్కృతుల అవగాహనతో పరిశోధించి ముందుకు సాగడమే  కాంప్ మ్యూజిక్ ప్రధాన లక్ష్యం. సంగీత శాస్త్రానికి మరింత వివరంగా భాష్యం చెప్పి, దాన్ని క్రమబద్దీకరించడం ద్వారా సంగీతాన్ని సంగణక పరిశోదనకు అనువుగా రూపుదిద్దుతుంది. అంతేకాక దీనివల్ల శబ్ధ తరంగాల విశ్లేషణలకి, అసలు ఆ సంగీతంలో ఉండే అర్థవంతమైన భావాలకి మద్య తరచూ ఏర్పడే వైషమ్యం తొలగిపోతుంది. పాశ్చాత్యేతర దేశాల సంగీత బాండాగారాలకు సరిపోయే సమాచార నమూనాకల్పక సిద్దాంతాలు ప్రతిపాదించి, తద్వారా ఆయా దేశ సంస్కృతులను ప్రతిబింభించేలా వాటికి సంగీత సంగణక నమూనాలు తయారుచేయాలన్నది ఈ ప్రాజెక్టు ఉద్దేశ్యం.

ఈ పరిశోధక సవాళ్ళను కాంప్ మ్యూజిక్ ఏ విధంగా ఎదుర్కొంటుందంటే:

  1. సమాచార విశ్లేషణ, సంగణక సంగీతశాస్త్రం, సంగీత గ్రాహక శాస్త్రం మరియు మానవ-యంత్ర ప్రతిస్పందక శాస్త్రం మొదలగు శాస్త్ర విభాగాల్లోని విధానాలను కలపడం ద్వారా.
  2. భారత దేశ (హిందుస్థానీ, కర్ణాటక), టర్కీ (ఒట్టోమాన్), అరబ్ దేశాలు (అండలూసియన్) మరియు చైనా (హన్) వంటి ముఖ్యమైన పాశ్చాత్యేతర దేశాల సంగీత సంప్రదాయాల నుంచి శబ్ధ తరంగ లక్షణాలు, చిహ్నరూపేణా ఉన్న సంగీతం, వ్యాఖ్యానాలు, వాడుకరుల విశ్లేషణ వంటి ఎన్నో రకాల సమాచారాన్ని సేకరించి విశ్లేషించడం ద్వారా.

సమకాలీన పాశ్చాత్యనుకూల సమాచార నమూనాలను సవాలు చేసి, మన సమాచార సాంకేతిక శాస్త్ర పరిశోధనని మరింత ముందుకు తీసుకుని వెళ్ళి, భిన్నసంస్కృతులతో విలసిల్లే ఈ ప్రపంచానికి సహాయపడడమే కాంప్ మ్యూజిక్ లక్ష్యం.